Wednesday, December 10, 2008
ముంబాయి పై "టెర్రర్ ఎటాక్"
నేనూ, మా తమ్ముడూ మామూలుగానే స్కూలుకి తయ్యారయ్యి, బస్సు స్టాపులో నుంచొని ఉంటే, ఒక అంకులొచ్చి ఆ రోజు స్కూలు లేదని చెప్పారు. మొదట సెలవని ఆనంద పడినా, ఆ తరువాత న్యూసు లో చూసినతరువాత, ఎంతో భయమేసింది. ఇది ఇండియాకి 9/11 వంటిదని అందరూ మాట్లాడుకుంటున్నారు. ఎప్పుడు న్యూసు చానలు చూడని మేము, రెండు రోజుల నుండి న్యూసు చానలు ఒక్కటే చూస్తున్నాము.
ఇప్పుడు ఎక్కడకెళ్ళeలన్నా, ఏంచెయ్యాలన్నా భయమే. ఆ ఆతంకవాదులు ఎదో వ్రతం పెట్టుకున్నట్లు 5000 మంది ని చంపాలని వచ్చారట. తాజ్ వంటి గొప్ప భవనాన్ని ధ్వంశం చేసారు. ఇవన్నీ ఆలోచిస్తే, నాకొక ఆలోచన వచ్చింది. మనం ఆతంకవాదుల ద్వారా చాలా విషయాలు నేర్చుకోవాలి.
1. వాళ్ళ "planning". అసలు వాళ్ళు ఎంత గొప్ప ప్లానులు వేసారంటే, వాళ్ళనుకునే పని తప్పక నెరవేరేదే. ఎంతో జాగ్రత్త గా, ఒక్కొక్క అడుగు ప్లాన్ చేసుకున్నారు. ఒకవేళ, మన ప్రభుత్వం కూడ అంత పక్కా ప్లానులు వేస్తే, మన దేశం ఎప్పుడో "flourish" అయ్యేది.
2. వాళ్ళ "planning" మీద నమ్మకం. వాళ్ళెంత "confidence" తో ఉన్నారంటే, వాళ్ళు తిరిగెళ్ళే ప్లాను కూడా వేసారు. ఈ ఆత్మవిశ్వాసం మంచి ప్లాను వేసినప్పుడే సాధ్యం అవుతుంది. ఈ "confidence" తో పాటు ధైర్యం కూడా అవసరం.
సమంష్టి కృషి: వాళ్ళలో ఎంత "coordination" లేక పోతే అలాంటి పనిని అంత ధైర్యం గా చెయగలరు? వాళ్ళు "ఒకరికి ఒకరు" అనుకుంటూ మొత్తం ప్లాను అంతా అమర్చుకున్నారు.
వాళ్ళు నిర్వహించే పని చాలా రిస్క్ తో కూడినది. ప్రతీక్షణం ప్లాను ఎలా అయినా మారచ్చు. కానీ బుర్ర ఉపయోగించడం అన్నిటికన్నా ముఖ్యం. వారి తెలివితేటల తో పాటు తొందరగా నిర్ణయం కూడా తీసుకో గలగాలి. ఒక క్షణం కూడా ఆలోచించటానికి సమయం ఉండదు, వారి దగ్గర.
ఇలా, మీరూ అలోచిస్తే, మీకుకూడా ఎన్నో విషయాలు కనిపిస్తాయి. కాని, ఈ లక్షణాలన్నీ సరియైన పద్ధతి లో ఉపయోగిస్తేనే మనకి మంచి చేస్తాయి. లేక పోతే, ఇదిగో, చూసారుగా ఏమయ్యిందో.
నేను ఈబ్లాగు టపా టెర్రరిస్టుల గురించి మీకు సమాచారం ఇద్దామని మొదలు పెట్టి చివరికి ఇక్కడ తేలాను. నాకనిపించిందీ, మీ అందరికి వీటి గురించి తెలిసే ఉంటుందని. (అందులో, నేను కాస్త బద్ధకస్తురాలిని కూడా కాబట్టి, నా ఆలోచన నాకే తెగ నచ్చేసింది.)
ఈసారి టపా ముగించే ముందు, మా క్లాసులో జరిగిన ఓ రెండు జోకులు చెప్తా.
నేను హైదరాబాదు లో ఉన్నప్పుడు, మా తెలుగు సారు ఎన్నో జోకులేసేవారు. క్లాసు అయ్యేదాకా మేము నవ్వుతూనే ఉండే వాళ్ళం. "transfer" అయ్యినప్పుడు ఆయన జోకులు "miss" అవుతానేమోననుకున్నాను. కానీ, ఇక్కడ హిందీ సారు కూడ మా తెలుగు సార్లానే ఉన్నారు .
మొన్న క్లాసులో ఒక అబ్బాయి బాగా అల్లరి చేస్తుంటే ఆయన, " ఏమిటి బాబూ, ఇంత పెద్ద దాడి చేసినా కూడ తనివితీరలేదా (ఆ అబ్బాయి టెర్రరిస్టని అర్ధం)!
మర్నాడు, మాకో లేఖ వ్రాయమని చెప్పారు. అయితే, ఒక అబ్బాయి సార్ ని అడిగాడు, " సార్, చిరునామా ఏమి వ్రాయాలి? " దానికి సార్,
“ఒక బతికున్న ఆతంకవాదుడు,
లష్కార్ ఈ తైబా
కరాచి
పాకిస్తాన్"
ఇలా అనగానే, నాకెంత నవ్వొచ్చిందంటే…:))))
Wednesday, November 5, 2008
అమ్మో !! ఎన్నాళ్ళయింది (-2)
స్పయిడర్ మ్యాన్ తరువాత
స్పయిడర్ మ్యాన్, అనకొండా తరువాత
అనకొండా 2, లాగే అమ్మో!! ఎన్నాళ్ళయింది తరువాత
అమ్మో!! ఎన్నాళ్ళయ్యింది - 2 అన్నమాట. అలాగే, ఈ టపా లో స్కూలు నం. 2 గురించి రాస్తున్నా. మా నాన్నగారికి ట్రాన్స్ఫర్ అయ్యి మేము ముంబాయి వచ్చి పడ్డాం. ఇక్కడ
కొత్త
స్కూలు, కొత్త
మిత్రులు, అన్నీ కొత్త. అందుకునే ఈ కొత్త
టపా కూడా. ఇక్కడ
స్కూలు లో తెలుగు కూడ
లేదు. అందుకునే, కనీసం నా మాతృభాష
గుర్తుంచుకోవటానికేనా ఈ బ్లాగును కొనసాగించాలి. అందులోనూ, నాకు కూడ
టపాలు వ్రాయటం ఇష్టమే, కానీ…..(ఈ స్కూలు ;) )
స్కూలు గురించి చెప్పాలంటే, హైదరాబాదు స్కూలు కన్నా నయం… అంటాననుకున్నరా? అబ్బే, అంత
తేడా ఏం లేదు. కాని, ఒక
పెద్ద
తేడా ఏమిటంటే, ఇక్కడ
వాళ్ళు బాగా సెలవలిస్తారు. దీపావళి కి 20 రోజులు సెలవులిచ్చారు (అంతకన్న
ఏం కావాలి?). కానీ దసరా కు సెలవులు లేవు.
సెలవుల మాట
వదిలేస్తే (ఎందుకంటే, ఒక
విద్యార్థికి సెలవుల
విషయం లో సంతృప్తి ఉండదు) పాత
స్కూలుకు, కొత్త
స్కూలుకు ఎక్కువ
తేడా లేదు. కానీ మనుషులు కాస్త
తేడా గా ఉన్నారనిపిస్తోంది. నేనొకరోజు ఏం పనిలేక
అలా కూర్చునివుంటే, ఒక
అమ్మాయి గబగబ వచ్చేసి,
ఆ అమ్మాయి: ప్లీజ్, నేను నీ ఫ్రెండ్ గా ఉండచ్చా?
నేను: ఓకే
తను: నీకొక విషయం చెప్పాలి, ఎవ్వరికీ చెప్పవు కదు?
నేను: సరే!
తను: నాకు బ్రేయిన్ ట్యూమర్
నేను మొదట్లో నమ్మలే కాని, తరవాత
నమ్మాల్సొచ్చింది. కాని తరవాత తెల్సింది అదంతా పెద్ద
నాటకం అని.
నా పక్కన
ఒక
అబ్బయి కూర్చునే వాడు. టీచరు ఏదైనా పనిస్తే, పక్కనుండి తన
గొంతు: " అబ్బా, ఎంత
చెత్త
పని! " లేక, " అబ్బా! ఎంత
పెద్ద సమస్య/పని! " అక్కడ ఓ వారమే కూర్చున్నా, విసిగిపోయాననుకోండి.
వెళ్ళగానే ఓ రెండు వారాలపాటు పరీక్షలు. పరీక్షలు అయిపోగానే హైదరాబాదు ప్రయాణం. వెంటనే, నెల
దాటగానే మళ్ళీ రెండు వారాలు పరీక్షలే. అలా పరీక్షలవ్వగానే, మళ్ళీ హైదరాబాదు. ఇదన్నమాట, మేము ముంబాయి వచ్చాక
చేసింది.
మొన్ననే హైదరాబాదు నుండి తిరిగొచ్చి, ఓ టపా రాద్దామనుకున్నాను (ఇదిగో, ఈ టపానే). మళ్ళీ ఓ వారం లో స్కూలు మొదలైపోతుంది కదా, అందుకునే ఎన్ని టపాలు రాయగలిగి తే అన్ని టపాలు రాస్తా. లేకపోతే, వచ్చే సంవత్సరం " అమ్మో!! ఎన్నాళ్ళయింది – 3 రాయాల్సొస్తుంది. :)))
Thursday, May 1, 2008
అమ్మో!! ఎన్నాళ్ళయ్యింది
అమ్మో!! ఎన్నాళ్ళయ్యింది, అసలు ఓ టపా రాసి. ఎంత
రాయాలనిపించినా, రాయటానికి అస్సలు "time" లేదు. ఏదో సాకు చెపుతున్నానని అనుకోద్దు. ఇది నిజమండి! మొన్న మార్చి లోనే పరీక్షలయ్యాయా? ఏదో పెద్ద, బోలెడు సెలవలిచ్చేసినట్లు ఓ పది రోజులిచ్చి, మళ్ళీ స్కూలు మొదలెట్టారు. అప్పటినుండి మమ్మల్ని పీల్చి పిప్పి చేయటం మొదలు. ఓ గమ్యం పెట్టుకుంటే గానీ అవ్వదనుకుంటా! ఆ, మొన్నే గమ్యం సినిమాకెళ్ళాం. అది అసలు గమ్యం లేని సినిమా అని నాన్నగారు "comment" చేసారు. అంటే కథ బాగానే ఉంది కాని, బాగ సాగతీసారు.
అయితే, స్కూలు సంగతికొస్తే, బాగా కష్టమైపోతోంది. మీరు నన్ను కంప్లైంటు డబ్బా అనక పోతే, నేను, మా స్కూలును ఎందుకు అంతగా ఇష్టపడట్లేదో చెబుతా:
ఒకటి) మేమేవైనా గాడిదలమా? అంత బరువులు మొయ్యటానికి??
రెండు) కనీసం అ బరువు పెట్టుకోడానికి 'లాకర్లే'నా లేవు.
మూడు) ఆ హోమ్ వర్కు చేస్తే, తెలిసిందీ, నేర్చుకున్నదీ మర్చిపోతాం.
నాలుగు) మీకు తెలుసా, మా నాన్నగారికి కూడా శనివారం సెలవు. కాని మాకు "full day". అన్యాయం కదూ! L
అయిదు) ప్రతి వారం ఓ పరీక్ష రాసీ రాసీ చేతులు నొప్పి. ఇంకొన్నాళ్ళయితే, అలా రాస్తూండటం అలవాటైపోతుంది. ఏంచేస్తూన్నా, అలా ఓ చేత్తో రాస్తూ ఉంటామేమో!!
ఇన్ని కారణాలు. తరువాత, సెలవలివ్వటానికి ఓ అరిగిపోతారు, ఏంటో! మొన్నెప్పుడో పెద్ద
వర్షం వచ్చి, అనుకోకుండా సెలవొచ్చింది. ఆ రోజు మాకు సినిమా కూడా ఉండింది. అయితే, అప్పుడిచ్చిన సెలవకి, ఓ రెండునెలల తరువాత, ఓరెండో శనివారం స్కూలు పెట్టారు. మరి అప్పుడు పోయిన సినిమా ఎవరు చూపిస్తారమ్మా?? నాకు ఎంత కోపం వచ్చిందంటే……
ఈ మధ్య సెలవులిచ్చేముందు, చాలా మంది మా స్కూల్లో "admissions" కోసం వచ్చారు. మెమేమో మైదానానికి వెళ్ళొస్తుంటే, ఓ ఆవిడ మాదగ్గరకి వచ్చి, రహస్యంగా, "ఈ స్కూలు మంచిదేనా?" అని అడిగింది. ఆవిడలా అడగగానే నాకింకొక తింగర ప్రశ్న గుర్తుకొచ్చింది. మనం మిఠాయి దుకాణానికి వెళ్ళి, " ఫ్రెష్షేనా?" అని అడుగుతాం. అసలు బుద్ధున్నవాడెవరైనా "లేదండి, ఈ స్వీట్లు ఫ్రెష్షుగా లేవు" అని అంటాడా?? అలాగే, ఆవిడడిగినంత మాత్రాన్న, మాకు మా స్కూలు నచ్చనంతమాత్రాన్న , "లేదండి, ఈ స్కూలు మంచిది కాదు" అని చెపుతామా?? అది నా స్నేహితురాలితో చెబితే తనంది, "అయితే వెళ్ళి చెప్పనా, ఈ స్కూలు మంచిది కాదని?" అని అడిగింది. నేనిలా చెబితే మీకు నవ్వొచ్చుండదు కాని, అప్పుడు తనలా అనేసరికి, ఇద్దరం కలిసి చాలా నవ్వాం. ఆతరువాతే అనిపించింది, "ఎంతైనా, ఏమైనా, నా బడి నాకిష్టం. "
మన స్కూలు విషయానికొస్తే, ఈ విధానాలు మాత్రం చాలా మారాలి. పిల్లలికి చెప్పినవి గుర్తుండాలంటే, అవి మంచి, సున్నితమైన పద్ధతి లో అందివ్వాలి. అదేదో స్కూలులో అట, పొద్దున్న ఎనిమిది నుండి, సాయంత్రం ఎనిమిది వరకూ విద్యాబోధనే్. నేనేమీ ఆ విధానాన్ని తప్పుపట్టట్లేదు. కొందరి పిల్లలికి అదే మంచిదేమో! ఈ విషయంలో తల్లిదండ్రుల
పాత్ర కూడా బానే ఉంది. వారి పిల్లలకు ఎట్లా విద్య బోధిస్తే బాగా అందుతుందో తెలుసుకుని, ఆ విధంగా బోధిస్తే, పిల్లలికి చెప్పినది, ఎక్కువ కష్టం అవ్వకుండా, త్వరగా అర్థమవుతుంది.
Sunday, March 30, 2008
చలో... తిరుపతి
పుణ్యక్షేత్రం అనగానే చాలా మందికి తిరుపతే గుర్తొస్తుంది. ఈ మధ్యలో తిరుపతెళ్ళడం ఎంత సులభమయ్యిందో, అంతకు రెండు రెట్లు కష్టం అయ్యింది. ఇక్కడ నుండి అక్కడ కెళ్ళడం సులభమయిపోయింది కానీ అక్కడకెళ్ళింతరవాత తిండీ తిప్పలు, రూములూ కష్టమే. ఎలాగోలా "adjust" అయిపొవచ్చు కానీ కాస్త.....కష్టమే (కనీసం నాకు). అంతకన్నా కష్టమైనది ఆ దేవుడి దర్శనం. అప్పుడైనా రూముల విషయం లో గానీ, టిఫిన్ల విషయం లో గానీ "ఈ రూములా?? ఇడ్లీ నా?? "అంటే, పెద్దవాళ్ళంతా, "మా చిన్నప్పుడైతే ఇంకా కష్టమైయ్యేది. ఇప్పుడు చాల నయం" అంటారు. కానీ నాకనిపిస్తుంది, అప్పుడు రూముల దగ్గర సర్దుకునేవారు అయినా దర్శనం చక్కగా చేసుకునేవారు. కానీ ఇప్పుడు తిరగబడి రూముల్లో సుఖంగా ఉండి, దర్శనం మాత్రం తొక్కిసలాట. ఏదైతేనేం, ఓదగ్గర సుఖం, ఒక దగ్గర సర్దుకోవడం. అయినా, ఆశావాదులకి సర్దుకోవడం కూడా ఓ సుఖమేలేండి.
సరే. చెప్పే విషమేమిటంటే, మొన్నే మేమందరం(ఇంకెవరు? మా నాన్న, అమ్మ, తమ్ముడు , బామ్మగారు, నేను కూడా :)) ) కలిసి తిరుపతెళ్ళాం. ఈ విషయం చెప్పటానికి ఇంత సేప్పట్టిందేంటీ అని అనుకుంటున్నారా?? రాసేది కాస్త వివరంగా రాస్తే బాగుంటుంది కదా అని కాస్త ఎక్కువ రాసా.
ఇక్కడ (హైదరాబాదు) సాయంత్రం బయలుదేరి పొద్దున్నకు తిరుపతి జేరాం. అక్కడ, ఓ హోటల్ లో తిన్నాం. అందరికి చెబుతున్నా, మీరు మాత్రం ఎప్పుడైనా తిరుపతెళ్తే, ఆ హోటల్ లో మాత్రం తినద్దు (రైల్వే వారి 'దీపికా'కు ఎదురు గా ఉన్నది). నాకే కాదు, అక్కడకొచ్చిన వారెవ్వరికి అక్కడి తిండి నచ్చలేదు. స్పూను కోసం అడిగితే, ఆ హోటల్ వాడు "పుణ్యక్షేత్రానికొచ్చినప్పుడు చేతి తో తినాలి" అని నక్క సమాధానం ఇచ్చాడు (అంటే నక్క లాగా జవాబిచ్చాడని అర్థం). ఆకలి బాధ భరించలేక, ఏదో, రెండు ముద్దలు తిని, బయటపడ్డాం.
మేము గనక అలవేలు మంగను దర్శించక పోతే, ఒకవేళ ఆవిడ అలిగితే, మరలా వేంకటేశ్వర స్వామి వారికి, ఆవిడను సమాధాన పరచడం కష్టమవుతుందేమోనని, మొదట, అలివేలు మంగాదేవి నే దర్శించాం. క్యూ లో ఇసుకేస్తే రాలనంత జనం. (నిజం గా ఇసుకేస్తే రాలదేమో!!). సరే, ఎలాగోలా దర్శనం చేసుకుని బయట పడ్డాం. అందరికీ ఇంకొక్కసారి దర్శనం అయితే బాగుంటుందని అనిపించినా, అది సాధ్యం కాదు. నన్నడిగితే, ఉచిత దర్శనానికే వెళ్ళమని చెబుతా. జనం తక్కువ ఉంటారని అందరు టికెట్టు కొనడంతో, ఇక్కడ ఇంకా జనం వచ్చేసారు (ఉచిత దర్శనం క్యూ ఖాళీ! ). అప్పుడు తెలుసుకున్నాం మా తప్పు. సర్లేండి., కనీసం మీరైనా ఈసారి సుఖంగా వెళ్ళొచ్చు, ఇది తెలుసుకుని.
ఆ తరువాతరోజు సరాసరి వేంకటేశ్వర స్వామి దర్శనానికే. అక్కడే అలా వుంటే, ఇక్కడెలా వుంటుందో అని భయపడ్డాం. అసలు, వీళ్ళు చెత్తన్నార రూల్స్ పెట్టి, దర్శన ఎలా కష్టంగా చెయ్యాలా అని ఆలోచిస్తారు. ఎలాగూ, క్యూలో తోపుడే. ముసలీ ముక్కా అందరిని తోస్తారు. అసలు మీకు తెలుసా? ఈ దేవస్థానం వాళ్ళని చూసే జనం కూడా తోపుడు నేర్చుకున్నారు. మనం ఎంత పరిగెట్టినా, మన వెనకాలొచ్చి మరీ తోస్తారు వాళ్ళు. కాని, మొదటి సారి దర్శనం చాలా బాగా జరిగింది. గుడి లోపలికి వచ్చేసరికి ఎక్కవగా తోపుడు లేకుండా నే అయిపోయింది.
కానీ, రెండొవ సారి మాత్రం బానే కష్టమయ్యింది. ఏదైతేనేం? పూర్తి యాత్ర బాగా జరిగింది. వచ్చేటప్పుడు, వరాహ స్వామి ఆలయం కూడా చూశాం. కొండ దిగిన తరువాత, గోవింద రాజ స్వామి ఆలయమును కూడా చూశాం. అందరూ, ఆయన తమ్ముడినే చూడటానికి వెళ్ళడం తో, పాపం ఆయనను నిర్లక్ష్యం చేస్తున్నారు.
రవీంద్రనాథ్ ఠాగోర్, తన ప్రఖ్యాత కావ్యమాల , గీతాంజలి లో అన్నట్లుగా, ఆభరణాలు ధరించిన వారి సహజ సౌందర్యం బయటవారికి తెలియదు. అలాగే, గొవింద రాజ స్వామి వారి రూపం ఎంతో మనోహరం గా ఉంది. ఆ అందం వేంకటేశ్వరునికి ఉన్నా, ఆభరాణాల తెర దాన్ని కప్పివేస్తోంది.
ఆఖరికి, మా ప్రయాణం ఓ ముగింపుకు వచ్చింది. రైల్వే స్టేషనుకు వచ్చి రైలు కోసం ఎదురు చూస్తూ, మా ప్రయాణాన్నంతా ఒక్కసారి మళ్ళీ గుర్తు చేసుకున్నాం. ఈసారి యాత్ర చాలా అహ్లాదకరంగా జరిగిందనిపించింది.
Friday, March 21, 2008
నా మొదటి టపా
మా నాన్నగారు తెలుగు లో వ్రాయడం మొదలు పెట్టినప్పటి నుండి నాకు కూడా తెలుగు లో వ్రాయాలని కోరిక పుట్టింది. సరే, ఓ బ్లాగు మొదలెడితే బాగుంటుంది అని, చివరికి "వరాళి వీచికలు" అనే ఈ బ్లాగు మొదలెట్టా. ఏపేరు పెట్టను అని కనిపించిన వాళ్ళందరినీ అడిగా. చివరికి మా అమ్మ నాకే కాక నాబ్లాగుకి కూడా పేరెట్టింది.
ముందే చెప్పాగా, నేను మొన్న మీటింగు జరిగినపుడు నాన్నగారితో వెళ్ళానని . బానే ఉంది కానీ ఇంకా మంచిగా చెయ్యచ్చు(దాని గురించి ఓ టపా రాస్తాన్లెండి) . మొదటి టపా కదా, చిన్నదేలేండి. రెండో టపా పెద్దగా ఉండటానికి సరిపడా సంగతులు వెతుకుతా.