Thursday, May 1, 2008

అమ్మో!! ఎన్నాళ్ళయ్యింది

అమ్మో!! ఎన్నాళ్ళయ్యింది, అసలు ఓ టపా రాసి. ఎంత
రాయాలనిపించినా, రాయటానికి అస్సలు "time" లేదు. ఏదో సాకు చెపుతున్నానని అనుకోద్దు. ఇది నిజమండి! మొన్న మార్చి లోనే పరీక్షలయ్యాయా? ఏదో పెద్ద, బోలెడు సెలవలిచ్చేసినట్లు ఓ పది రోజులిచ్చి, మళ్ళీ స్కూలు మొదలెట్టారు. అప్పటినుండి మమ్మల్ని పీల్చి పిప్పి చేయటం మొదలు. ఓ గమ్యం పెట్టుకుంటే గానీ అవ్వదనుకుంటా! ఆ, మొన్నే గమ్యం సినిమాకెళ్ళాం. అది అసలు గమ్యం లేని సినిమా అని నాన్నగారు "comment" చేసారు. అంటే కథ బాగానే ఉంది కాని, బాగ సాగతీసారు.

అయితే, స్కూలు సంగతికొస్తే, బాగా కష్టమైపోతోంది. మీరు నన్ను కంప్లైంటు డబ్బా అనక పోతే, నేను, మా స్కూలును ఎందుకు అంతగా ఇష్టపడట్లేదో చెబుతా:
ఒకటి) మేమేవైనా గాడిదలమా? అంత బరువులు మొయ్యటానికి??

రెండు) కనీసం అ బరువు పెట్టుకోడానికి 'లాకర్లే'నా లేవు.

మూడు) ఆ హోమ్ వర్కు చేస్తే, తెలిసిందీ, నేర్చుకున్నదీ మర్చిపోతాం.

నాలుగు) మీకు తెలుసా, మా నాన్నగారికి కూడా శనివారం సెలవు. కాని మాకు "full day". అన్యాయం కదూ! L

అయిదు) ప్రతి వారం ఓ పరీక్ష రాసీ రాసీ చేతులు నొప్పి. ఇంకొన్నాళ్ళయితే, అలా రాస్తూండటం అలవాటైపోతుంది. ఏంచేస్తూన్నా, అలా ఓ చేత్తో రాస్తూ ఉంటామేమో!!
ఇన్ని కారణాలు. తరువాత, సెలవలివ్వటానికి ఓ అరిగిపోతారు, ఏంటో! మొన్నెప్పుడో పెద్ద
వర్షం వచ్చి, అనుకోకుండా సెలవొచ్చింది. ఆ రోజు మాకు సినిమా కూడా ఉండింది. అయితే, అప్పుడిచ్చిన సెలవకి, ఓ రెండునెలల తరువాత, ఓరెండో శనివారం స్కూలు పెట్టారు. మరి అప్పుడు పోయిన సినిమా ఎవరు చూపిస్తారమ్మా?? నాకు ఎంత కోపం వచ్చిందంటే……
ఈ మధ్య సెలవులిచ్చేముందు, చాలా మంది మా స్కూల్లో "admissions" కోసం వచ్చారు. మెమేమో మైదానానికి వెళ్ళొస్తుంటే, ఓ ఆవిడ మాదగ్గరకి వచ్చి, రహస్యంగా, "ఈ స్కూలు మంచిదేనా?" అని అడిగింది. ఆవిడలా అడగగానే నాకింకొక తింగర ప్రశ్న గుర్తుకొచ్చింది. మనం మిఠాయి దుకాణానికి వెళ్ళి, " ఫ్రెష్షేనా?" అని అడుగుతాం. అసలు బుద్ధున్నవాడెవరైనా "లేదండి, ఈ స్వీట్లు ఫ్రెష్షుగా లేవు" అని అంటాడా?? అలాగే, ఆవిడడిగినంత మాత్రాన్న, మాకు మా స్కూలు నచ్చనంతమాత్రాన్న , "లేదండి, ఈ స్కూలు మంచిది కాదు" అని చెపుతామా?? అది నా స్నేహితురాలితో చెబితే తనంది, "అయితే వెళ్ళి చెప్పనా, ఈ స్కూలు మంచిది కాదని?" అని అడిగింది. నేనిలా చెబితే మీకు నవ్వొచ్చుండదు కాని, అప్పుడు తనలా అనేసరికి, ఇద్దరం కలిసి చాలా నవ్వాం. ఆతరువాతే అనిపించింది, "ఎంతైనా, ఏమైనా, నా బడి నాకిష్టం. "
మన స్కూలు విషయానికొస్తే, ఈ విధానాలు మాత్రం చాలా మారాలి. పిల్లలికి చెప్పినవి గుర్తుండాలంటే, అవి మంచి, సున్నితమైన పద్ధతి లో అందివ్వాలి. అదేదో స్కూలులో అట, పొద్దున్న ఎనిమిది నుండి, సాయంత్రం ఎనిమిది వరకూ విద్యాబోధనే్. నేనేమీ ఆ విధానాన్ని తప్పుపట్టట్లేదు. కొందరి పిల్లలికి అదే మంచిదేమో! ఈ విషయంలో తల్లిదండ్రుల
పాత్ర కూడా బానే ఉంది. వారి పిల్లలకు ఎట్లా విద్య బోధిస్తే బాగా అందుతుందో తెలుసుకుని, ఆ విధంగా బోధిస్తే, పిల్లలికి చెప్పినది, ఎక్కువ కష్టం అవ్వకుండా, త్వరగా అర్థమవుతుంది.


6 comments:

  1. శ్రావ్య అయితే సెలవలని సంతోషపడినంత సేపుకూడా లేవన్నమాట.ఇదే టపా ని చాలామంది పెద్దవాళ్ళు రాసారు.అప్పట్లో మా మా అభిప్రాయాలు రాసాము.కానీ అనుభవిస్తున్న మీ నోటినుండి వింటుంటే మేము మరింత ఆలోచించాల్సిన అవసరం కనిపిస్తుంది.నిజమే తల్లిదండ్రుల పాత్ర వున్నా ఏమీ చేయలేని పరిస్థితి.అన్ని పాఠశాలలూ ఒకేలా వుంటే మాకు ఎంచుకోడానికి అవకాశం లేకుండా పోతుంది.పళ్ళూడగొట్టుకోవడానికి ఏరాయయినా ఒకటే కదా.కొంతలో కొంత ఆర్ ఎస్ ఎస్ వాళ్ళు నడిపే సరస్వతీ శిశుమందిర్ పాఠశాలలు మంచివి.అంటే వీళ్ళు గొప్ప అని,బండెడు పుస్తకాలు ఇవ్వరని అనను గానీ,చదువులతోపాటూ ఆటలు,పాటలు,పద్యాలు మొదలయినవి "సదాచారం" పేరుతో నేర్పిస్తారు.మరి హైదరాబాదు వంటి పెద్ద నగరాలలో పరిస్థితి నాకు తెలియదు. ఎవరయినా తెలిస్తే చెప్పగలరు.

    ReplyDelete
  2. నాన్నగారికి శనివారం సెలవు. మరి నీకు దశరా సెలవులు, సంక్రాంతి సెలవులు, ఎండాకాలం సెలవులు వుంటున్నాయిగా? రోజూ అన్ని పుస్తకాలు తీసుకు వెళ్లవలసిన అవసరం ఏమిటి? "అదేదో స్కూలులో అట, పొద్దున్న ఎనిమిది నుండి, సాయంత్రం ఎనిమిది వరకూ విద్యాబోధనే్." ఇలాంటి స్కూళ్లలో చదివే పిల్లలు నిస్త్రాణంగా (depressed) ఉంటున్నారని మానసిక శాస్త్రవేత్తలంటున్నారు. చదువుతో పాటుగా ఆటలున్నప్పుడే, మనస్సు చురుగ్గా పనిచేస్తుంది.

    ReplyDelete
  3. అప్పుడే పుస్తకాల వైరాగ్యమా....?? ఇంతకీ ఏమి చదువుతున్నావో చెప్పనేలేదు ...??
    అయినా...ఆ సమయంలో అలానే అనిపిస్తుంది కాని..."మాకు చెప్పే పద్దతి నచ్చలేదు అని..."
    మీకు మాష్టారు ఒక్కడు..(ఒక సబ్జెక్టుకు)...కానీ అదేమాష్టారుకు.... క్లాసుడు పిల్లలు...తలో రకంగా చెప్పటం???
    కనుక....అయినదానికి కానిదానికి దెబ్బలేసే రాక్షస మాష్టార్లు తప్ప.. మిగిలినవన్నీ మన విద్యాభోదనలో బాగనే ఉంటాయి...

    ఏలా అని అడగాలి అని ఉందా....??
    దేశం మెత్తం మీద... ఏ రాష్ట్ర్రంలో అయినా.... పదవతరగతి పది సార్లు తప్పి.... పదేళ్ళతరువాత ...అతి కష్టమయిన సాప్ట్ వేర్ జాబ్ లు సునాయాసంగా పట్టగలిగే అతిరధ మహారధులు కేవలం మన ఆంద్రవారి సొంతం.....కనుక ఈ సిస్టంలో..మనకు ఉపయోగపడేవి అంతర్గతంగా ఉంటాయి... అవి ఇప్పుడు అర్దంకాకపోవచ్చు....(నువ్వు చినాపిల్లవయితే)......ఇది ఒక్కటేనా అంటే..... చాలా ఉన్నాయి...చాట బారతం అవుతుంది అని ఇక్కడ రాయటం లేదు.....

    ఏట్టకేలకు... నీ స్కూలు నీకు ఇష్టం అంటూన్నవ్ కనుక దిగులేలేదు.... సాగిపో చక్కగా నీ దారిలోనే....అవిఘ్నమస్తు....

    ReplyDelete
  4. మీ కామెంట్ల కు నా ధన్యవాదాలు. "grass on the other side is always greener" అని ఊరికే అనలేదు. అది కఛ్ఛితంగా నిజం. అసలు, ఇంకొకటి రాద్దాం అనుకున్నా. అదేంటంటే, "ఇప్పుడు అలా అనిపుస్తుంది కానీ, పెద్దయ్యి, ఈ స్కూలు విడిచి పెట్టాలంటే ఎంత బాధగా ఉంటుందో? అప్పుడు, ముందు చదివిన స్కూలే మేలనిపిస్తుంది, స్కూలే బాగుండేది." అనిపిస్తుంది .

    రావు గారు, ఇదంతా భరిస్తేనే పెద్దయ్యి సుఖపడచ్చు అని నేనొప్పుకుంటున్నా. కాని, స్కూలు జీవితం కంటే ఆఫీసు జీవితం సులభం అని మీరు ఒప్పుకోవాల్సిందే. కనీసం ఈ రోజుల్లో అది నిజం అని ఒప్పుకోవాలి. అది నిజమే కదు???? సరదాకన్నానులెండి!!!

    ReplyDelete
  5. కంప్యూటర్లో కొత్తగా తెలుగు రాస్తూ తప్పుల్లేకుండా రాయగలుగుతున్నందుకు ముందుగా మీకు అభినందనలు. తొలి తెలుగు బడిబ్లాగరు మీరేననుకుంటాను. మీరు రాస్తున్నట్టులేదు, మాట్లాడుతున్నట్టుంది ఈ టపా చదువుతూవుంటే.

    ఈ మధ్య నేను రాసిన ఒక టపాలో రెసిడెన్షియల్ జూనియర్ కాలేజీలను కోళ్లఫారాలు అన్నాను. బడులలో, కాలేజీల్లో (ముఖ్యంగా జూ. కాలేజీలు) అగచాట్లు నిజమేకానీ, చంద్రమౌళిగారి మాట కూడా చాలా నిజం. మనల్ని రాచి రంపాన పెట్టే ఈ విద్యావిధానమే మనల్ని గట్టివాళ్లుగా కూడా తయారుచేస్తుంది.

    డాక్టరునౌదామని, ఒక రెసిడెన్షియల్.జూ.కాలేజీలో ఎంసెట్ కోచింగ్ తీసుకుంటూ సంవత్సరం పాటు విపరీతంగా శ్రమపడ్డాను. నాకు వైద్యకళాశాలలో స్థానం దక్కకపోయినా...
    నేనప్పుడు చదివిన చదువుకూ,
    ఆతరువాత చదివిన చదువుకూ,
    ఇప్పుడు చేస్తున్న పనికీ చాలా వ్యత్యాసం వున్నా...
    లాంగ్ టర్మ్ కోచింగ్ లో నేను పడిన శ్రమ (మమ్మల్ని వాళ్లు పెట్టిన శ్రమ) నా ఆత్మవిశ్వాసాన్ని చాలా పెంచింది. పని ఎంత పెద్దదయినా భయపడకుండా మెల్లగా ప్రయత్నం ప్రారంభించి పూర్తిచేయడం అక్కడే నేర్చుకున్నాను. అంతేకాదు అక్కడ నేర్చుకొన్న కొన్ని విషయాలు ఇప్పటికీ ఏదో ఒక రూపంలో వుపయోగపడుతూనే వున్నాయి. ఫలితాలెలా వున్నా శ్రమ వృధా కాదని నాకనిపించింది.

    >>"కాని, స్కూలు జీవితం కంటే ఆఫీసు జీవితం సులభం అని మీరు ఒప్పుకోవాల్సిందే"
    ఔను, ఒప్పుకోవాల్సిందే! :)

    ReplyDelete
  6. You don't sound like a school-going girl... Are you really???

    ReplyDelete