పుణ్యక్షేత్రం అనగానే చాలా మందికి తిరుపతే గుర్తొస్తుంది. ఈ మధ్యలో తిరుపతెళ్ళడం ఎంత సులభమయ్యిందో, అంతకు రెండు రెట్లు కష్టం అయ్యింది. ఇక్కడ నుండి అక్కడ కెళ్ళడం సులభమయిపోయింది కానీ అక్కడకెళ్ళింతరవాత తిండీ తిప్పలు, రూములూ కష్టమే. ఎలాగోలా "adjust" అయిపొవచ్చు కానీ కాస్త.....కష్టమే (కనీసం నాకు). అంతకన్నా కష్టమైనది ఆ దేవుడి దర్శనం. అప్పుడైనా రూముల విషయం లో గానీ, టిఫిన్ల విషయం లో గానీ "ఈ రూములా?? ఇడ్లీ నా?? "అంటే, పెద్దవాళ్ళంతా, "మా చిన్నప్పుడైతే ఇంకా కష్టమైయ్యేది. ఇప్పుడు చాల నయం" అంటారు. కానీ నాకనిపిస్తుంది, అప్పుడు రూముల దగ్గర సర్దుకునేవారు అయినా దర్శనం చక్కగా చేసుకునేవారు. కానీ ఇప్పుడు తిరగబడి రూముల్లో సుఖంగా ఉండి, దర్శనం మాత్రం తొక్కిసలాట. ఏదైతేనేం, ఓదగ్గర సుఖం, ఒక దగ్గర సర్దుకోవడం. అయినా, ఆశావాదులకి సర్దుకోవడం కూడా ఓ సుఖమేలేండి.
సరే. చెప్పే విషమేమిటంటే, మొన్నే మేమందరం(ఇంకెవరు? మా నాన్న, అమ్మ, తమ్ముడు , బామ్మగారు, నేను కూడా :)) ) కలిసి తిరుపతెళ్ళాం. ఈ విషయం చెప్పటానికి ఇంత సేప్పట్టిందేంటీ అని అనుకుంటున్నారా?? రాసేది కాస్త వివరంగా రాస్తే బాగుంటుంది కదా అని కాస్త ఎక్కువ రాసా.
ఇక్కడ (హైదరాబాదు) సాయంత్రం బయలుదేరి పొద్దున్నకు తిరుపతి జేరాం. అక్కడ, ఓ హోటల్ లో తిన్నాం. అందరికి చెబుతున్నా, మీరు మాత్రం ఎప్పుడైనా తిరుపతెళ్తే, ఆ హోటల్ లో మాత్రం తినద్దు (రైల్వే వారి 'దీపికా'కు ఎదురు గా ఉన్నది). నాకే కాదు, అక్కడకొచ్చిన వారెవ్వరికి అక్కడి తిండి నచ్చలేదు. స్పూను కోసం అడిగితే, ఆ హోటల్ వాడు "పుణ్యక్షేత్రానికొచ్చినప్పుడు చేతి తో తినాలి" అని నక్క సమాధానం ఇచ్చాడు (అంటే నక్క లాగా జవాబిచ్చాడని అర్థం). ఆకలి బాధ భరించలేక, ఏదో, రెండు ముద్దలు తిని, బయటపడ్డాం.
మేము గనక అలవేలు మంగను దర్శించక పోతే, ఒకవేళ ఆవిడ అలిగితే, మరలా వేంకటేశ్వర స్వామి వారికి, ఆవిడను సమాధాన పరచడం కష్టమవుతుందేమోనని, మొదట, అలివేలు మంగాదేవి నే దర్శించాం. క్యూ లో ఇసుకేస్తే రాలనంత జనం. (నిజం గా ఇసుకేస్తే రాలదేమో!!). సరే, ఎలాగోలా దర్శనం చేసుకుని బయట పడ్డాం. అందరికీ ఇంకొక్కసారి దర్శనం అయితే బాగుంటుందని అనిపించినా, అది సాధ్యం కాదు. నన్నడిగితే, ఉచిత దర్శనానికే వెళ్ళమని చెబుతా. జనం తక్కువ ఉంటారని అందరు టికెట్టు కొనడంతో, ఇక్కడ ఇంకా జనం వచ్చేసారు (ఉచిత దర్శనం క్యూ ఖాళీ! ). అప్పుడు తెలుసుకున్నాం మా తప్పు. సర్లేండి., కనీసం మీరైనా ఈసారి సుఖంగా వెళ్ళొచ్చు, ఇది తెలుసుకుని.
ఆ తరువాతరోజు సరాసరి వేంకటేశ్వర స్వామి దర్శనానికే. అక్కడే అలా వుంటే, ఇక్కడెలా వుంటుందో అని భయపడ్డాం. అసలు, వీళ్ళు చెత్తన్నార రూల్స్ పెట్టి, దర్శన ఎలా కష్టంగా చెయ్యాలా అని ఆలోచిస్తారు. ఎలాగూ, క్యూలో తోపుడే. ముసలీ ముక్కా అందరిని తోస్తారు. అసలు మీకు తెలుసా? ఈ దేవస్థానం వాళ్ళని చూసే జనం కూడా తోపుడు నేర్చుకున్నారు. మనం ఎంత పరిగెట్టినా, మన వెనకాలొచ్చి మరీ తోస్తారు వాళ్ళు. కాని, మొదటి సారి దర్శనం చాలా బాగా జరిగింది. గుడి లోపలికి వచ్చేసరికి ఎక్కవగా తోపుడు లేకుండా నే అయిపోయింది.
కానీ, రెండొవ సారి మాత్రం బానే కష్టమయ్యింది. ఏదైతేనేం? పూర్తి యాత్ర బాగా జరిగింది. వచ్చేటప్పుడు, వరాహ స్వామి ఆలయం కూడా చూశాం. కొండ దిగిన తరువాత, గోవింద రాజ స్వామి ఆలయమును కూడా చూశాం. అందరూ, ఆయన తమ్ముడినే చూడటానికి వెళ్ళడం తో, పాపం ఆయనను నిర్లక్ష్యం చేస్తున్నారు.
రవీంద్రనాథ్ ఠాగోర్, తన ప్రఖ్యాత కావ్యమాల , గీతాంజలి లో అన్నట్లుగా, ఆభరణాలు ధరించిన వారి సహజ సౌందర్యం బయటవారికి తెలియదు. అలాగే, గొవింద రాజ స్వామి వారి రూపం ఎంతో మనోహరం గా ఉంది. ఆ అందం వేంకటేశ్వరునికి ఉన్నా, ఆభరాణాల తెర దాన్ని కప్పివేస్తోంది.
ఆఖరికి, మా ప్రయాణం ఓ ముగింపుకు వచ్చింది. రైల్వే స్టేషనుకు వచ్చి రైలు కోసం ఎదురు చూస్తూ, మా ప్రయాణాన్నంతా ఒక్కసారి మళ్ళీ గుర్తు చేసుకున్నాం. ఈసారి యాత్ర చాలా అహ్లాదకరంగా జరిగిందనిపించింది.
శ్రావ్యా - నువ్వు రాసిన చివరి మాట వరసగానే నీ ఈ తిరుపతి దర్శన టపా కూడా ఆహ్లాదకరంగా ఉంది...
ReplyDeleteశ్రావ్యా -నీ తిరుపతి ప్రయాణం లో స్వామి దర్శనం రెండు సార్లు అయినందులకు అభినందనలు. తిరుమల లో geological wonder శిలాతోరణం, స్వామి వారి మ్యూజియం,కృష్ణదేవరాయల మండపం, అన్నమాచార్యుల సంకీర్తన భండాగారం చూడతగ్గవి. పాపవినాశనమైన జలపాతం కు 3 కి.మీ.దూరంలోని జాబాలి తీర్థం (అంజనాదేవి ఆంజనెయునికి జన్మనిచ్చిన స్థలం),10 కి.మీ. దూరంలోని తుంబుర తీర్థం (నారదుడి గర్వాన్ని భంగం చేసిన సంగీతజ్ఞుడు తుంబురుడు),అక్కడికి దగ్గరలో వున్న కుమారధార లో భక్తులు స్నానము చేస్తారు. అన్నమయ్య భండాగారం దగ్గరలో ఉన్న శ్రీవారి డాలర్లు వద్ద స్వామి వారి బంగారు మరియు వెండి డాలర్లు భక్తులు కొంటారు.నీవు పైన చెప్పిన వన్నీ miss అయ్యినట్లుంది.
ReplyDeleteకెమరా తెసుకెళ్లటం మరిచావా? ఒక్క ఛాయాచిత్రం కూడా లేదు -నీ వ్యాసంలో.
నీ తిరుపతి ప్రయాణం విశేషాలు బాగున్నాయి శ్రావ్య.
ReplyDeleteబ్లాగు మొదలుపెట్టినందుకు నీకు, తెలుగు అంటించినందుకు మీ నాన్నగారికి అభినందనలు.
రావు గారు, మీరు చెప్పినవన్నీ చూడాలంటే, ఓ వారం అయినా ఉండాలి. మేము కేవలం రెండు రోజులకు మాత్రమే వెళ్ళాం. అయినా, "next time" వెళ్ళినప్పుడు, అవన్నీ చూసే వస్తా.
ReplyDelete"camera" తీసుకెళ్ళ లే,ఎందుకంటే, ఎలాగూ తీసుకెళ్ళినా లోపలికి తీసుకెళ్ళలేం కదా!!