Wednesday, April 22, 2009

అమ్మో ఎన్నాళ్ళయ్యింది -3 మాత్రం కాదు

నేను టపా వ్రాసి చాలా రోజులైనప్పటికీ, ఇది అమ్మో ఎన్నాళ్ళయ్యింది -3 మాత్రం కాదు.

మీలో చాలా మందికి " మర్ఫీ' స్ లా " తెలిసే ఉంటుంది. అయినా కూడా నేను దానిగురించి చెపుతాను. మర్ఫీ' స్ లా ఏమంటుందంటే, "Anything that can go wrong will go wrong. “అంటె, ఒకవేళ ఏదైనా తప్పుజరిగే అవకాశం ఉంటే, తప్పు జరుగుతుంది. అర్ధం కావట్లేదు కదూ? అయితే, ఈ కథ వినండి. సిమన్ ఒక బొమ్మల కంపెనీకి మేనేజర్. ఆ వారం తను 1000 టెడ్డి బేర్లను "stuff" చెయ్యాలి ఇంకా 2000 బొమ్మ కార్లను "assemble" చెయ్యాలి. ఆ కార్లలో ఒకటి బాస్ కొడుకు పుట్టినరోజున బహుమానం కింద ఇవ్వాలి. రాగల అవకాశం ఉన్న సమస్యలను, దొర్లగల తప్పులను వ్రాసుకుని జాగర్తపడ్డాడు. ఆ సోమవారం, ఇంకా 200 టెడ్డి బేర్లు మిగిలిపోయాయి. ఈలోపే సూపర్వైజర్ సిమన్ ను పిలిచి, ఒక తయారైన టెడ్డీ బేర్ ను చేతికిచ్చాడు. చూస్తే, ఆ టెడ్డీ బేర్ లో మెత్తటి దూది కాకుండా, గట్టిగా, ఏవో ముక్కలు తగిలాయి. తను 'జరగవచ్చు' అనుకున్న తప్పులు కాకుండా మరేదో జరిగింది. అప్పుడు, సిమన్ కు అంతా అర్థమయ్యింది. ఆ "stuffing machine" బొమ్మ కారు చక్రాలను ముక్కలు చేసి, టెడ్డి బేర్ లో కుక్కేసింది. ఒక్క క్షణం అంతా శూన్యం. కిటికీలోంటి చూస్తే డెలివరీ వేన్ రెడీగా ఉంది. ఇప్పుడు కాదూ అంటే వేన్ మళ్ళీ దొరకడం కష్టం. పెనాల్టీ కూడా కట్టాలి. వెంటనే తమాయించుకుని, సూపర్వైజర్ చేత "labels" తయారు చేయించి తెప్పించాడు. వాటిమీద ఇలా వ్రాసుంది: "ఎవరైతే టెడ్డ్డి బేరును పాడు చేయకుండా కేవలం తడిమి దానిలో ఏమి "stuff" చేసుందో చెబుతారో, వారికి 200 డాలర్ల బహుమానం లభిస్తుంది." ఒక సమస్యను పరిష్కరించాడు. కానీ, బాస్ కొడుకు పుట్టినరోజు బహుమానం? దానికి ఆ బాబును ఫాక్టరీ కు తీసుకొచ్చి (కారు) బొమ్మలు తయ్యారవ్వటం చూపిస్తే అయిపోతుంది కదా! అలాగే చేసాడు.

మొన్నామధ్య మర్ఫీస్ లా బోర్లా పడచ్చని ఒక సంఘటన ద్వారా అనుభవమైంది. దాంతో మా నాన్నగారు రివర్స్ మర్ఫీస్ లా (దాన్ని సత్యసాయీస్ లా అందాం) సూత్రీకరించారు. "సత్యసాయీ' స్ లా" ఏమిటంటే, ఒకవేళ ఏదైనా సక్రమంగా జరిగేందుకు అవకాశం పెద్దగా లేకపోయినా, అది సక్రమంగా జరగవచ్చు. ఎలా అంటే…ఈ కథ చదవండి.

నిన్న ప్రొజెక్ట్ చార్ట్లు "submit" చేసేందుకు ఆఖరి రోజు. కానీ నేనూ, నా మిత్రురాలు, ఇద్దరం కలిసి మా మా చార్ట్లను మర్చిపోయాము (మేము మిత్రులమని నిరూపించుకున్నాము.) అయితే, ఇవ్వాళ తేవాలనుకున్నాం కాని, ఇవ్వాళ మాకు (వాలెంటీర్ చెయ్యని వాళ్ళకు) స్కూలు లేదు. ఆ అమ్మాయి వాళ్ళ బిల్డింగ్ నుండి వచ్చే ఇంకో అమ్మయి కిచ్చి చార్టును మా తమ్ముడికిప్పిస్తుందన్నమాట. మా తమ్ముడు , నా చార్టు తీసుకుని, ఆ అమ్మాయి దగ్గర మా మిత్రురాలి చార్ట్ తీసుకుని, టీచరుకు ఇచ్చేస్తాడన్నమాట. ఇది మా ప్లాను. కాని, నేను ఆ అమ్మాయి పేరు, క్లాసు కనుక్కోవడం మర్చిపోయాను. తరువాత, మేం చేసిన మరో తప్పేంటంటే, ఆ అమ్మయిని "direct" గా మా టీచర్ కి కాకుండా మా తమ్ముడికి ఇవ్వాలని చెప్పడం.

అయితే, ఇవ్వాళ, నేను ఏడున్నర కు లేచేటప్పటికి, తెలిసిందేమిటంటే, మా తమ్ముడు స్కూలుకు వెళ్ళలేదని. దానితో నాకేంచెయ్యలో తోచలేదు. నా ప్రమేయమేమీ లేకుండానే, కళ్ళనుండి నీళ్ళుకారడం మొదలెట్టాయి. అప్పుడు మా నాన్నగారు నాకు ధైర్యం చెప్పి స్కూలుకు తీసుకెళ్ళారు. ఇష్టంలేకుండానే తయారై, స్కూలుకు వెళ్ళాను. వెళ్ళగానే టీచరు తిడుతుందనుకున్నాను కాని, నవ్వి చార్టు ఎక్కడపెట్టాలో చెప్పింది. హమ్మయ్యా!! నా చార్టు ఇచ్చేశాను. కాని మా మిత్రురాలిది? ఆ చార్టు తెచ్చే అమ్మాయి ఏ క్లాసో కూడా తెలియదు. ఏం చెయ్యాలో అర్ధం కాలేదు. మా మిత్రురాలికి ఫోను కూడా కలవలేదు. ఒకసారి బిల్డింగ్ అంతా చుట్టి కూడా వచ్చేశా. కానీ ఆ చార్టు జాడ మాత్రం లేదు. ఆ అమ్మాయికి మా తమ్ముడు క్లాసు ఒక్కటే తెలుసు. అయితే, మా తమ్ముడు క్లాస్మేట్ కు అంతా వివరంగా చెప్పి ఎవరైనా మా తమ్ముడికోసం వెతుక్కుంటూ వస్తే మా క్లాసుకి డైరెక్ట్ చేసే సహాయం చేయమని అడిగితే తను ఒప్పుకున్నాడు. మంచివాడే. కాస్త ఇబ్బందిగా బయటకొచ్చి , సరే ఇంటికెళ్దాం అని అయిష్టంగా బయటకొచ్చాను. ఆ రెండో చార్టు మీద "almost" ఆశ వదిలేశాను. ఎందుకైనా మంచిదని మా తమ్ముడి క్లాసుకేసి వెళ్ళి చూద్దామని అటువేపు ఓ రెండడుగులేసా. అయితే బిల్డింగ్ నుండి బైటకురాగానే, ఓ అమ్మాయి ఎర్ర చార్టు తో వస్తూ కనిపించింది. నాకెందుకో అది మా చార్టేనని అనిపించింది. నేనైతే ‘ఎర్రచీర కట్టుకున్నదే నా పెళ్ళాం’ అనే టైపు కాకపోయినా, నాకెందుకలా అనిపించిందో తెలియదు. అయితే, వెంటనే నేను వెళ్ళి ఆ చార్టు లాక్కోగానే, ఆ చార్టు పట్టుకున్న అమ్మాయి తెల్లబోయింది. నేను తనని వెంటనే ఏవేవో ప్రశ్నలడిగా (మా మిత్రురాలు పంపిందేమోనని). ఆ ప్రశ్నలకు తను మరింత తెల్లబోయింది. తను మా మిత్రురాలు పంపిన అమ్మాయి కాదు. తనకెవరో అబ్బాయి ఇచ్చాడట. ఆఅబ్బాయికి వాళ్ళ టీచర్ ఇచ్చారట. టీచరుకి మాస్నేహితురాలి స్నేహితురాలిచ్చుంటుంది. ఆ చార్టు నాదేనని చెప్పి నమ్మ బలికి, అది తీసుకుని మా టీచర్ కి ఇచ్చేసొచ్చా. హమ్మ! ఎన్ని లంకెలో. ఒక్కసారి తిరిగి జరిగినవన్నీ తలచుకుంటే, ఆశ్చర్యమేస్తుంది. ఈసంఘటనలో పని సక్రమంగా జరగకుండా ఉండటానికి చాలా అవకాశాలున్నాయి.

కానీ, ఒకవేళ ఏదైనా సక్రమంగా జరిగేందుకు పెద్దగా అవకాశం లేకపోయినా, అది సక్రమంగా జరగవచ్చు కదా!!

మీ శ్రావ్య

2 comments:

  1. ఇది చదివాక ఇంతకీ అది శ్రావ్య స్నేహితురాలు పంపిన ఛార్ట్ ఎలా అవుతుంది అని అనుకుంటూ ఏమి రాయాలనుకుంటూ, వ్యాఖ్య వద్దులే అనుకుంటూ ఈ ఉత్తరం రాస్తున్నా. ఇది "సత్యసాయీ' స్ లా" ప్రకారం జరిగిందా?

    ReplyDelete
  2. జరిగేది ఎప్పటికైనా జరుగుతుంది, జరగనిది ఎప్పటికీ జరగదు... - ఏదో సిన్మాలో రజనీకాంత్ ..ఇంతకు మించి నాకు ఏం చెప్పాలో తెలియదు. కాని కాసేపు నా బుర్ర కు పని పెట్టింది మీ పోస్టు.

    ReplyDelete