అమ్మో!! ఎన్నాళ్ళయ్యింది, అసలు ఓ టపా రాసి. ఎంత
రాయాలనిపించినా, రాయటానికి అస్సలు "time" లేదు. ఏదో సాకు చెపుతున్నానని అనుకోద్దు. ఇది నిజమండి! మొన్న మార్చి లోనే పరీక్షలయ్యాయా? ఏదో పెద్ద, బోలెడు సెలవలిచ్చేసినట్లు ఓ పది రోజులిచ్చి, మళ్ళీ స్కూలు మొదలెట్టారు. అప్పటినుండి మమ్మల్ని పీల్చి పిప్పి చేయటం మొదలు. ఓ గమ్యం పెట్టుకుంటే గానీ అవ్వదనుకుంటా! ఆ, మొన్నే గమ్యం సినిమాకెళ్ళాం. అది అసలు గమ్యం లేని సినిమా అని నాన్నగారు "comment" చేసారు. అంటే కథ బాగానే ఉంది కాని, బాగ సాగతీసారు.
అయితే, స్కూలు సంగతికొస్తే, బాగా కష్టమైపోతోంది. మీరు నన్ను కంప్లైంటు డబ్బా అనక పోతే, నేను, మా స్కూలును ఎందుకు అంతగా ఇష్టపడట్లేదో చెబుతా:
ఒకటి) మేమేవైనా గాడిదలమా? అంత బరువులు మొయ్యటానికి??
రెండు) కనీసం అ బరువు పెట్టుకోడానికి 'లాకర్లే'నా లేవు.
మూడు) ఆ హోమ్ వర్కు చేస్తే, తెలిసిందీ, నేర్చుకున్నదీ మర్చిపోతాం.
నాలుగు) మీకు తెలుసా, మా నాన్నగారికి కూడా శనివారం సెలవు. కాని మాకు "full day". అన్యాయం కదూ! L
అయిదు) ప్రతి వారం ఓ పరీక్ష రాసీ రాసీ చేతులు నొప్పి. ఇంకొన్నాళ్ళయితే, అలా రాస్తూండటం అలవాటైపోతుంది. ఏంచేస్తూన్నా, అలా ఓ చేత్తో రాస్తూ ఉంటామేమో!!
ఇన్ని కారణాలు. తరువాత, సెలవలివ్వటానికి ఓ అరిగిపోతారు, ఏంటో! మొన్నెప్పుడో పెద్ద
వర్షం వచ్చి, అనుకోకుండా సెలవొచ్చింది. ఆ రోజు మాకు సినిమా కూడా ఉండింది. అయితే, అప్పుడిచ్చిన సెలవకి, ఓ రెండునెలల తరువాత, ఓరెండో శనివారం స్కూలు పెట్టారు. మరి అప్పుడు పోయిన సినిమా ఎవరు చూపిస్తారమ్మా?? నాకు ఎంత కోపం వచ్చిందంటే……
ఈ మధ్య సెలవులిచ్చేముందు, చాలా మంది మా స్కూల్లో "admissions" కోసం వచ్చారు. మెమేమో మైదానానికి వెళ్ళొస్తుంటే, ఓ ఆవిడ మాదగ్గరకి వచ్చి, రహస్యంగా, "ఈ స్కూలు మంచిదేనా?" అని అడిగింది. ఆవిడలా అడగగానే నాకింకొక తింగర ప్రశ్న గుర్తుకొచ్చింది. మనం మిఠాయి దుకాణానికి వెళ్ళి, " ఫ్రెష్షేనా?" అని అడుగుతాం. అసలు బుద్ధున్నవాడెవరైనా "లేదండి, ఈ స్వీట్లు ఫ్రెష్షుగా లేవు" అని అంటాడా?? అలాగే, ఆవిడడిగినంత మాత్రాన్న, మాకు మా స్కూలు నచ్చనంతమాత్రాన్న , "లేదండి, ఈ స్కూలు మంచిది కాదు" అని చెపుతామా?? అది నా స్నేహితురాలితో చెబితే తనంది, "అయితే వెళ్ళి చెప్పనా, ఈ స్కూలు మంచిది కాదని?" అని అడిగింది. నేనిలా చెబితే మీకు నవ్వొచ్చుండదు కాని, అప్పుడు తనలా అనేసరికి, ఇద్దరం కలిసి చాలా నవ్వాం. ఆతరువాతే అనిపించింది, "ఎంతైనా, ఏమైనా, నా బడి నాకిష్టం. "
మన స్కూలు విషయానికొస్తే, ఈ విధానాలు మాత్రం చాలా మారాలి. పిల్లలికి చెప్పినవి గుర్తుండాలంటే, అవి మంచి, సున్నితమైన పద్ధతి లో అందివ్వాలి. అదేదో స్కూలులో అట, పొద్దున్న ఎనిమిది నుండి, సాయంత్రం ఎనిమిది వరకూ విద్యాబోధనే్. నేనేమీ ఆ విధానాన్ని తప్పుపట్టట్లేదు. కొందరి పిల్లలికి అదే మంచిదేమో! ఈ విషయంలో తల్లిదండ్రుల
పాత్ర కూడా బానే ఉంది. వారి పిల్లలకు ఎట్లా విద్య బోధిస్తే బాగా అందుతుందో తెలుసుకుని, ఆ విధంగా బోధిస్తే, పిల్లలికి చెప్పినది, ఎక్కువ కష్టం అవ్వకుండా, త్వరగా అర్థమవుతుంది.